Tragedy | దసరా సెలవు విషయంలో ఇద్దరు ఆయాల మధ్య జరిగిన గొడవకు రెండు నెలల పసికందు బలైంది. సెలవు దొరక్క విధుల్లోకి వచ్చిన ఆయా.. చిన్నారికి పాలుపట్టకపోవడంతో ఆకలితో ఏడ్చి ఏడ్చి మరణించింది. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని శ్మశానంలో రహస్యంగా పాతిపెట్టారు. కానీ సిబ్బంది మధ్య విభేదాల కారణంగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కల్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ తనకు జన్మించిన మగ శిశువును పోషించలేక ఆగస్టు 30వ తేదీన అనంతపురంలోని ఐసీడీఎస్ అనుబంధ శిశుగృహకు అప్పగించింది. అప్పటి నుంచి వారే ఆ శిశువును సంరక్షిస్తున్నారు. సాధారణంగా రాత్రిపూట శిశు సంరక్షణ కేంద్రంలో ఇద్దరు ఆయాలు విధుల్లో ఉండాల్సి ఉంటుంది. కానీ అక్టోబర్ 2వ తేదీ దసరా రోజున ఒకరు మాత్రమే విధుల్లోకి వచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ కొంతసేపటికి పసికందు ఆరోగ్యం బాగోలేదంటూ సర్వజన ఆస్పత్రికి ఆయా బిడ్డను తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే శిశువు మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం బయటకు పొక్కకుండా శిశువును శ్మశానంలో పూడ్చివేశారు. అయితే సిబ్బంది మధ్య విభేదాలు ఉండటంతో ఈ విషయం బయటకు వచ్చింది.
అక్టోబర్ 2వ తేదీన దసరా సందర్భంగా సెలవు విషయంలో ఇద్దరు ఆయాల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో సెలవు దొరకని ఆయా అయిష్టంగానే విధుల్లోకి వచ్చింది. ఏ పని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంది. పసికందు ఆకలితో ఎంత ఏడ్చినా సరే పాలుపట్టకుండా అలాగే ఉంది. ఇలా ఆకలితో అలమటించి, ఏడ్చి ఏడ్చి శిశువు మరణించినట్లు సమాచారం. శిశుగృహంలో పనిచేస్తున్న ఏఎన్ఎం కూడా తరచూ విధులకు హాజరుకావడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు సిబ్బంది మధ్య ఎవరు ఏ పనులు చేయాలన్న దానిపై కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం. అధికారుల పరిశీలనలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని భావిస్తున్నారు. కాగా, ఆ శిశువు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే మృతి చెందిందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమణి చెప్పడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న కలెక్టర్ ఆనంద్ సమగ్ర నివేదిక అందించాలని పీడీని ఆదేశించారు.