Murali Naik |హైదరాబాద్ మే 10 (నమస్తేతెలంగాణ): తల్లిదండ్రులు, బంధువులు, ఆత్మీయులు, ప్రజానీకం అశ్రునయనాల మధ్య… యూరీ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మరళీనాయక్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి.
మురళి భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో బెంగళూరు నుంచి కల్లితండాకు తరలించారు. దేశసేవకోసం వెళ్లి, శవపేటికలో విగతజీవిగా తిరిగివచ్చిన కొడుకును చూసి తల్లిదండ్రులు శ్రీరామ్‌నాయక్, జ్యోతిబాయి హృదయవిదారకంగా రోదించారు. వేలాదిమంది మురళి పార్థివదేహంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులు, జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు పూర్తిచేశారు. మురళీనాయక్ అంత్యక్రియలకు మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ హాజరయ్యారు. మురళీనాయక్ తల్లిదండ్రులతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌షిండే వీడియోకాల్‌లో మాట్లాడారు. ఘాట్కోపర్లో మురళీనాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మురళీ.. ఇక మాకెవరు దిక్కు!
‘మురళీ.. మమ్మల్ని అనాథలను చేసి ఎక్కడికె ళ్తివిరా.. రెక్కలు ముక్కలుజేసి పెంచితిమి గదరా.. నువ్వు దేశ సేవకోసం సైన్యంలో చేరితే గర్వపడ్డాం. నువ్వు చవువుకుని మమ్మల్ని చూసుకుంటావని ఆశ పడితే ఎంత అన్యాయం చేస్తివి. నువ్వు లేని లోకంలో మేం బతికేదెట్ల..?’ అంటూ అమర జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్, జ్యోతినాయక్ కన్నీటిపర్యంతమయ్యారు. తమ అబ్బాయి దేశం కోసం పోరాడి అమరుడు కావడం గర్వంగా ఉన్నదని అన్నారు. తల్లి జ్యోతిబాయి మాట్లాడుతూ మురళి మొన్న వీడియాకాల్ జేసి మాట్లాడాడు. నేను బాగున్నా.. మీరు ఎట్లున్నారని అడిగాడు. ఇంతలోనే ఒక్కగానొక్క కొడుకు కానరానిలోకానికి వెళ్లిపోయాడు అని బోరునవిలపించారు.