India Pakistan Tension | ‘కొడుకా.. నా కన్నా.. రా నాన్నా.. నా బంగారుకొండా’ అంటూ ఆ తల్లి రోదన చూసేవారికి ఆవేదన కలిగించింది. ‘దేశం దేశమంటూ.. ఆ దేశం కోసమే ప్రాణమిచ్చావా బిడ్డా’ అని గుండెలు బాదుకుంటున్న ఆ మాతృమూర్తిని ఆపడం ఎవరితరమూ కాలేదు. కొడుకు భవిష్యత్తును ముష్కరులు ఒక్క నిమిషంలోనే చెరిపివేసిన ఘటనను తలుచుకుంటూ బిక్కుబిక్కుమంటున్న ఆ తండ్రిని చూసి చలించని హృదయం లేదు. ‘బతికితే సైనికుడిగానే బతుకుతా.. చస్తే సైనికుడిగానే చస్తా’ అన్న మురళీనాయక్ మాటలను తలుచుకొని బంధుమిత్రులు రోదించిన తీరుతో ఊరంతా ఘొళ్లుమన్నది. యూరిలో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ స్వస్థలమైన ఏపీలోని కల్లితండాలో కనిపించిన హృదయవిదారక దృశ్యాలు.
హైదరాబాద్/ముంబై, మే 9 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు చెందిన శ్రీరామ్‌నాయక్, జ్యోతిబాయి దంపతుల ఏకైక సంతానమే మురళీనాయక్ (23).మురళీనాయక్ చిన్నతనంలోనే ఈ కుటుంబం బతుకుదెరువు కోసం ముంబై వెళ్లింది. అక్కడి ఘట్కోపర్ ప్రాంతంలో శ్రీరామ్‌నాయక్ కూలిపనులు చేస్తూ మురళిని చదివించాడు. మురళి 4వ తరగతి వరకు ముంబైలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత ఉన్నత చదువులన్నీ ఏపీలో పూర్తిచేశాడు. భారత సైన్యంలోకి వెళ్లాలని మురళికి చిన్ననాటి నుంచి కోరిక ఉండేది. తన కోరికను నెరవేర్చుకునేందుకు తల్లిదండ్రులను ఒప్పించి మళ్లీ ముంబై వెళ్లి నాసిక్‌లోని డియోలాలిలో ఆర్మీ శిక్షణ తీసుకున్నాడు. 2022లో అగ్నివీర్‌గా ఇండియన్ ఆర్మీలో చేరాడు. మురళికి మొదట అసోంలో పోస్టింగ్ రాగా, తర్వాత పంజాబ్‌లో విధులు నిర్వర్తించాడు. యుద్ధ సమయంలో అతనికి యూరీలో విధులు కేటాయించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు దుశ్చర్యను అడ్డుకునే క్రమంలో మురళి అసువులుబాసాడు.
చేస్తే జవాన్‌గానే.. చస్తే దేశం కోసమే
‘నాన్నా నేను ఆర్మీకి తప్ప.. మరో ఉద్యోగం చెయ్యను. చేస్తే జవాన్‌గానే చేయాలి.. అవసరమైతే దేశం కోసం ప్రాణాలు విడువాలి. నా శవంపై జాతీయ జెండా కప్పాలి. ఇవే నా కోరికలు.. నా ఆశయాలు’ అంటూ చిన్ననాటి నుంచే మురళీనాయక్ ఇండియన్ ఆర్మీపై మక్కువ పెంచుకున్నాడు. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య మురళీనాయక్ శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు యురిలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. ఇంతటి దేశభక్తి కలిగిన యువ సైనికుడు మురళీనాయక్ ముష్కరులను ఎదుర్కొంటూ అతి చిన్న వయసులోనే దేశంకోసం ప్రాణాలు అర్పించాడు. ‘ఒక్కరోజైనా సైనికుడిగా బతకాలి’ అనే అతని దేశభక్తి.. యావత్తు దేశప్రజల్లో స్ఫూర్తిని నింపింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత.. పాకిస్థాన్‌తో జరుగుతున్న యుద్ధంలో చొరబాటుదారులతో పోరాడుతూ అసువులు బాసాడు.
అమ్మవారి జాతర కోసం సొంతూరికి..
తమ స్వస్థలమైన కల్లితండాలో అమ్మవారి జాతర కోసం ఈ నెల 2న మురళీనాయక్ తల్లిదండ్రులు వచ్చారు. అక్కడ వారు జాతర పనుల్లో ఉండగానే కొడుకు అసువులు బాసాడనే దుర్వార్త తెలిసి, దుఃఖసాగరంలో మునిగిపోయారు. తల్లి జ్యోతిబాయి కొడుకును తల్చుకుంటూ విలపించిన తీరు.. చూసేవారి గుండెలను తడిమింది. కొడుకు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కండ్లలోంచి వస్తున్న కన్నీటిని అదిమిపడుతున్న ఆ తండ్రిని చూసి, ఊరంతా బోరున విలపించింది. ఎప్పుడూ దేశం, ఆర్మీ, యుద్ధం గురించి కబుర్లు చెప్పే స్నేహితుడు వీరమరణం పొందాడని తెలుసుకున్న అతని మిత్రుల కన్నీటిని ఆపడం ఎవరితరమూ కాలేదు. కల్లితండా సమీప గ్రామాలు, తండాలవాసులు వచ్చి మురళీనాయక్‌కు కన్నీటి నివాళులు అర్పించారు. ముంబై ఘాట్కోపర్ వార్డు నంబర్ 133లో మురళీనాయిక్కు సంతాపం తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేసి, స్థానికులు శ్రద్ధాంజలి అర్పించారు.
వీరజవాన్‌కు ప్రముఖుల నివాళి
యూరి ఉగ్రదాడిలో వీరమరణం పొందినది తెలుగు జవాన్ అని తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మురళీనాయక్ వీరమరణంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. దేశరక్షణ కోసం పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి అసువులు బాసిన బంజారా ముద్దుబిడ్డ మురళీనాయక్ ప్రాణ త్యాగం అజరామరమని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కొనియాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మురళీనాయక్‌కు ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు.
మురళీనాయక్‌కు అశ్రు నివాళి: కేటీఆర్
ఉగ్రవాదులతో పోరాడి అసువులు బాసిన వీరజవాన్ మురళీనాయక్ మృతికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. భారతీయుల రక్షణ కోసం అమరుడైన మురళీనాయక్‌కు జోహర్ అని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు.