గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు రెడ్ బుక్ ( Red book ) తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( YS Jagan ) ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పి, జంగిల్ రాజ్‌లా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) ఇంటిపై టీడీపీ మూకల దాడి, అంబటి రాంబాబు అరెస్టు వ్యవహరం తరువాత బుధవారం అంబటి కుటుంబాన్ని జగన్ పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా ధ్వంసమైన ఇంటి వస్తువులను, కార్లను పరిశీలించారు. అనంతరం అంబటి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
కేంద్రానికి సంబంధించిన ఎన్డీడీబీ ( NDDB ) , ఎన్డీఆర్ఐ ( NDRI ) ల్యాబ్‌లే తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని రిపోర్టులు ఇచ్చాక కూడా మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. లడ్డూ పై తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని, బాబుకు దేవుడంటే భక్తి, భయం రెండూ లేవని వ్యాఖ్యనించారు. అంబటిపై దాడిలో పోలీసుల కుట్ర కూడా దాగి ఉందని ఆరోపించారు.