Chandrababu | గత సార్వత్రిక ఎన్నికల్లో కాస్త పోరాడి ఉంటే పులివెందులలోనూ గెలిచేవాళ్లమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. గుజరాత్లో వరుసగా బీజేపీ గెలిచి అధికారంలో కొనసాగుతోందని తెలిపారు. ఇక్కడ నిరంతరం గెలిచేలా ఇకపై రాజకీయం చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు సమష్టిగా పోరాడదామని తెలిపారు.
పార్టీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఆమోదిస్తేనే నాయకులమవుతామని తెలిపారు. ఈ సమావేశంలో మహిళలు పెద్దగా కనబడటం లేదన్నారు. పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దిశానిర్దేశం చేశారు.