అమరావతి : ఏపీలో అడవులు నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని స్మగ్లర్లను ఏపీ సీఎం చంద్రబాబు (Chandra Babu ) అన్నారు. అడవుల్లో అడుగుపెడితే అదే వారికి చివరిరోజు అవుతుంది. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వన మహోత్సవం కార్యాక్రమంలో భాగంగా శుక్రవారం మంగళగిరిలోని ఎకో పార్కులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో కలిసి మొక్కలు నాటారు.
ఇకపై స్మగ్లర్ల ఆటలు సాగనివ్వమని వెల్లడించారు. వైసీపీ(YCP) ఐదేళ్ల పాలనలో నదులు, చెరువులు, కొండలు ధ్వంసానికి గురయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలని సూచించారు. మొక్కలు పెంచుతాం.. చెట్లు కొట్టనివ్వం .. ఇదే మా విధానమని ప్రకటించారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెరగాలని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకెళ్తామని, భవిష్యత్‌లో విద్యుదుత్పత్తిలో కాలుష్యం ఉండబోదని తెలిపారు. పర్యావరణ సమతుత్యం కోసం అందరూ పాటుపడాలని , జీవ వైవిధ్యానికి మన రాష్ట్రం చిరునామా కావాలని పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ వన మహోత్సవంలో కోటి మొక్కలు నాటుతామని, చెట్టు పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా అక్కడ మొక్కలు పెంచాలని కోరారు. కోనసీమలో కొబ్బరి చెట్టును పెద్దకొడుకుగా చూసుకుంటారని అన్నారు.