 
                                                            Chandrababu | తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్‌రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదని.. కనీసం చదవలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యానని.. 80ల్లో మంత్రి అయ్యానని.. అప్పట్నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. ఇప్పుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడ్ని నేనే అని అన్నారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అంతా నా తర్వాత వచ్చారని అన్నారు. రాజకీయాల్లో ఉంటే చరిత్ర అంతా చూస్తుంటాం కదా.. కానీ దేశంలో జగన్‌లాంటి వ్యక్తి ఎవరూ తగల్లేదని అన్నారు.
జగన్‌లాంటి వ్యక్తి చరిత్రలో ఒకడు దొరికాడని.. నార్త్ కొరియాలో ఒకరు ఉన్నాడని చంద్రబాబు అన్నారు. చరిత్రలో పాబ్లో ఎస్కోబార్ ఉన్నారని తెలిపారు. ఎస్కోబార్ కొలంబియన్ డ్రగ్ లార్డ్ అని.. నార్కో టెర్రిరిస్ట్ అని అన్నారు. అతను పొలిటీషియన్ అయిపోయి.. మిడిల్ ఇన్ కార్టల్ అనే పేరు పెట్టి డ్రగ్స్ అమ్మడానికి కారిడార్లను ఎస్టాబ్లిష్ చేశాడని చెప్పారు. దీంట్లో 30 బిలియన్ డాలర్లు సంపాదించడన్నారు. అది ఇప్పుడు 90 బిలియన్ డాలర్లు అయ్యాయని తెలిపారు. ఇతను 76లో అరెస్టు అయ్యాడని.. 80ల్లో నంబర్‌వన్ అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్ అయ్యాడన్నారు. డ్రగ్స్ అమ్మి కూడా రిచెస్ట్ ఫెలో అయ్యారని అన్నారు .మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా అదే అని ఎద్దేవా చేశారు. టాటా, రిలయన్స్, అదానీ వద్ద డబ్బులు ఉన్నాయని.. వాళ్ల కంటే ఎక్కువ సంపాదించాలనేది జగన్ కోరిక అన్నారు. కొంతమందికి నీడ్ ఉంటుంది.. కొంతమందికి గ్రీడ్ ఉంటుంది… కొంతమందికి పిచ్చి ఉంటుందని అన్నారు. అలా పిచ్చి పట్టిన వాళ్లే ఇలా చేస్తారని ఎద్దేవా చేశారు.
ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా, నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా అని తెలిపారు. అలాంటి ఇండియాలో ఇలాంటి హింసకు, నేర చరిత్రకు తావు ఉన్నదా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నేను ముఖ్యం కాదు.. ఈ రాష్ట్రం ముఖ్యం.. నేను శాశ్వతం కాదు.. ఈ రాష్ట్ర శాశ్వతం అని అన్నారు. అలాంటి ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రజలకు సూచించారు. మనల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడటం లేదు.. మీ అందరికీ ఇబ్బంది ఉంది.. నన్ను కూడా ఇబ్బంది పెట్టారు.. కానీ భగవంతుడు కాపాడాడన్నారు. వారిపై కక్ష తీర్చుకోవడానికి సిద్ధంగా లేనని.. ఆ భగవంతుడే శిక్షించాడని చెప్పారు. ఎవరూ రాజకీయాల్లో ఉన్నా ఫర్వాలేదు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలు కూడా ఆలోచించాలని అన్నారు.
 
                            