Sankranti | సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు తమ సొంతూళ్లకు బయలుదేరి వెళుతుండటంతో రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో శనివారం వాహనాల రద్దీ మరింత పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతున్నది. టికెట్ విక్రయ కేంద్రాల వద్ద బారీ క్యూ లైన్లలో ప్రయాణికులు బారులు తీరారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు రైళ్లలో వెళుతున్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏపీ, ఇతర రాష్ట్రాలకు వెళుతున్న బస్సులతో ట్రాఫిక్ మరింత పెరిగింది. బస్టాప్‌ల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో కేపీహెచ్‌బీ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
బస్సులు, కార్లు, ఇతర వాహనాల రద్దీతో కూకట్పల్లి, అమీర్‌పేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. దీంతో వాహన యజమానులు పలు అవస్థల పాలవుతున్నారు. వాహనాల రద్దీ పెరగడంతో పంతంగి, కొర్లపాడు టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు చెబుతున్నా వాహనాల రద్దీ మాత్రం తగ్గడం లేదు.