అమరావతి : భార్యపై భర్త కత్తితో దాడి చేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన పావని, పచ్చలమెట్ట ప్రాంతానికి చెందిన శింగంశెట్టి సాయి కొంతకాలం క్రితం ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు, దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించిన వీరు నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పావని తల్లి ఇంటికి వెళ్లి ప్రస్తుతం కాకినాడలో బీటెక్ చదువుతోంది.
ఈ నేపథ్యంలో పావనిని తల్లిదండ్రులు భర్త వద్దకు పంపేందుకు నిరాకరించగా సాయి మనోవేదనకు గురై పోతవరం వెళ్లాడు. అక్కడ భార్యతో వాగ్వాదానికి దిగి కత్తితో దాడి చేశాడు. అంతేకాకుండా అత్తపై కూడా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పావనితోపాటు, ఆమె తల్లిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.