హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): గత నెల రోజులుగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ భక్తుల రద్దీ తగ్గడం లేదు. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో.. కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే బుధవారం స్వామివారిని రికార్డు స్థాయిలో 80,440 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఒక్కరోజు టీటీడీకి హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు వచ్చింది. ఇది ఇలావుండగా రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.