Srisailam Project | శ్రీశైలం, జులై 24 : శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. రెండు క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి 54,590 క్యూసెక్కుల నీటిని సాగరు విడుదల చేస్తున్నారు. జలాశయానికి గురువారం జూరాల గేట్ల ద్వారా 20,590 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,545 క్యూసెక్కులు వస్తున్నది. అలాగే, సుంకేసుల నుంచి 43,790 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. గురువారం సాయంత్రానికి 79,899 క్యూసెక్కుల నీరు డ్యామ్‌కు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుతోత్పత్తి కొనసాగుతుండగా.. 66,810 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ వైపు వెళ్తున్నది.
హంద్రీనివా ప్రాజెక్టుకు 1598 క్యూసెక్కులు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు 1300 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు 24,166 క్యూసెక్కుల నీటిని విడుదలవుతుంది. ప్రస్తుతం జలాశయం నుంచి 1,42,685 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉందని అధికారులు వివరించారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.10 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 205.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వివరించారు. ప్రస్తుతం వర్షాలు కొనసాగుతుండడంతో ప్రాజెక్టుకు వరద కొసాగే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.