Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలం భక్తులతో సందడిగా కనిపించింది. వరుసగా సెలవులు రావడంతో క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. మార్గశిర మాస పౌర్ణమి ప్రత్యేక శోభ సంతరించుకున్నది. ఈ క్రమంలో ఆలయ వీధులన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. వరుసగా వారాంతపు సెలవులు కలిసిరావడంతో కుటుంబసమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనాలు ఉచిత దర్శనానికి 3 గంటలు, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టింది. విరామ, వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శనాలు కల్పించడంతో వేలాది మంది ఉభయ దేవాలయాల్లో దర్శనాలు చేసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు అల్పాహారాన్ని అందిస్తున్నట్లు పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు తెలిపారు. దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులకు అమ్మవారి ఆలయం వెనుక భాగంలోనూ భక్తులకు ప్రసాదం అందిస్తున్నారు.