అమరావతి : ఈనెల 23,24వ తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని వాతావరణశాఖ (Meteorological Department ) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రేపటికి తుఫాన్‌గా బలపడనుందని వెల్లడించింది. రెండు రోజుల పాటు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
తీరం వైపు వెళ్లే కొద్దీ తుఫాన్ మరింత బలపడనున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాను తీరందాటే సమయంలో గంటకు 100-110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం అక్టోబరు 24, 25న పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఈ ప్రభావంతో అనకాపల్లి విజయనగరం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ కూర్మనాథ్ తెలిపారు.