Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్ వేగంగా కదులుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 10కి.మీ. వేగంతో దూసుకొస్తోంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కి.మీ., కాకినాడకు 190కి.మీ., విశాఖపట్నానికి 280 కి.మీ. దూరంలో తుపాన్ కేంద్రీకృతమైంది. ఇవాళ రాత్రి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీవ్ర తుపాన్‌గా తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
తీవ్ర తుపాన్ తీరం దగ్గరికి వచ్చే కొద్దీ ప్రభావం పెరుగుతోంది. దీంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. రేపు ఉదయం వరకు గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో, ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో ఫ్లాష్ ఫడ్స్ సంభవించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుపాన్ నేపథ్యంలో కాకినాడ పోర్టుకు పదో నంబర్ ప్రమాద హెచ్చరికను విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం జారీ చేసింది.
తుపాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటలకే పక్కకు ఆపుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే తుపాన్ నేపథ్యంలో శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులను రద్దు చేశారు. అలాగే ఏపీ నుంచి శంషాబాద్ రావాల్సిన 17 విమానాలను రద్దు చేశారు.