అమరావతి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏలూరులోని పోలవరం (Polavaram) స్పిల్ వే నుంచి 4,84,022 క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతుంది . స్పిల్ వే ఎగువన 30 మీటర్ల నీటి మట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇటు విజయవాడ లోని ప్రకాశం బ్యారేజి(Prakasam Barrage) 7 గేట్లు ఎత్తి 7,135 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
కృష్ణ నది నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం(Srisailam) జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తుంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి 82, 398 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 813 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 36.08 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మరోవైపు ఏపీలో నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, ఓడిశా తీర ప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.