Srisailam Dam| శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఈ క్రమంలో అధికారులు రెండోసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఒక గేటును పది అడుగుల మేర ఎత్తడంతో కృష్ణమ్మ ఉరకలు వేస్తూ సాగర్ వైపు వెళ్తున్నది. ప్రస్తుతం జలాశయానికి 87,535 క్యూసెక్కులు ఉన్నది.
శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం ఎగువన ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్ నుంచి, సుంకేశుల నుంచి వరద వస్తున్నది. మొత్తం జలాశయం నుంచి 94,916 క్యూసెక్కులు విడుదల అవుతున్నది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.90 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలె కాగా.. ప్రస్తుతం 209.1579 టీఎంసీల నీరుంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.