ఢిల్లీ : తిరుమల లడ్డూ (Tirumala Laddu ) తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో(Supreme Court ) గురువారం విచారణ ప్రారంభమయ్యింది. ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉండడం వల్ల సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి మేరకు కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
భక్తుల మనోభావాలను, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandra babu) వ్యాఖ్యలు చేశారంటూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ మాజీ చైర్మన్ , వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ధర్మాసనానికి మరో ముఖ్య కేసు ఉన్నందున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుంది. రేపు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడుతామని న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కొనసాగించాలా ? లేంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.