AP DGP | ఏపీ డీజీపీగా హరీశ్ గుప్తాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారక తిరుమల రావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో హరీశ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించి హరీశ్ గుప్తాను డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఆయన కొద్దికాలం డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమల రావును డీజీపీగా నియమించింది. ఆ తర్వాత హరీశ్ కుమార్ గుప్తా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియామకమయ్యారు.
హరీశ్ గుప్తా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండగా.. ప్రస్తుతం డీజీపీ పోస్టుకు ద్వారక తిరుమల రావు తర్వాత.. సీనియారిటీ అగ్నిమాపక శాఖ డీజీ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మాదిరెడ్డికి ఉన్నది. అయితే, శాంతి భద్రతల విభాగంతో పాటు హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, జైళ్ల శాఖ డీజీగా పని చేసిన అనుభవంతో పాటు ఎన్నికల సమయంలోనూ డీజీపీగా పని చేసిన అనుభవం ఉన్న హరీశ్ గుప్తా పనితీరుతో సీఎం చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారని.. ఆయననే పూర్తి డీజీపీగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం.