Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన గురువారం రాత్రి స్వామివారు మలయప్ప స్వామి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి మలయప్ప స్వామివారు వీణాపాణియై హంసవాహనంపై దర్శనమిచ్చారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఓ ప్రత్యేకత ఉన్నది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరుడిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతిని కలిగిస్తాడని విశ్వాసం.
హంస వాహనంపై ఊరేగే శ్రీనివాసుని దర్శిస్తే అహంకారం పటాపంచలైపోతుందని.. ఎలాగైతే హంస పాలను నీళ్లను వేరు చేస్తుందో అలాగే ఏది మంచో, ఏది చెడో గ్రహించగల విచక్షణ కలిగించే భాగ్యాన్ని ఆ శ్రీనివాసుడు ప్రసాదిస్తాడని.. అదే హంస వాహన సేవ పరమార్ధం. ఇది గహించడమే మన జీవితానికి పరమార్థమని పండితులు చెబుతున్నారు. భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, కళాకారుల ప్రదర్శన నడుమ హంసవాహన సేవను కనుల పండువగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు ఐదుతలల చినశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.