సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సునీల్‌కుమార్ సీఐడీ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో అక్రమ కేసులు బనాయించి తనను కస్టడీలోకి తీసుకోవడమే కాకుండా.. హత్యాతయత్నం చేశారని గుంటూరు జిల్లా ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. దీనిపై స్పందించిన పోలీసులు సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు సీఐడీ మాజీ ఐజీ సునీల్ నాయక్, మాజీ డీఎస్పీ పాల్పైనా కేసు నమోదు చేశారు.
మరోవైపు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో నందిగం సురేశ్‌కు చెందిన భవనానికి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై వారంలోగా వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నందిగం సురేశ్‌కు చెందిన భవనం అమరావతి పరిధిలో ఉన్నందున సీఆర్డీఏతో పాటు ఉద్దండరాయునిపాలెం పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసులు ఇచ్చారు.