US Visa | అమెరికా వీసా రాలేదని గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని నివాసంలో నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడింది.
రోహిణి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరుకు చెందిన రోహిణి రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని, అక్కడే ప్రాక్టీస్ చేయాలని కలలు కన్నది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే అమెరికా వెళ్లిన ఆమె.. రెసిడెన్సీ, ప్రాక్టీస్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. జే 1 వీసా కోసం కూడా దరఖాస్తు చేసుకుంది. ఇంతలోనే విదేశీ విద్యార్థులు, నిపుణులకు సంబంధించిన వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక మార్పులు తీసుకొచ్చారు. దీంతో రోహిణి అమెరికా వీడి ఇండియాకు రావాల్సి వచ్చింది.
హైదరాబాద్ నుంచే అమెరికాలో జే 1 వీసా కోసం రోహిణి ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో మొదటి మూడు విడతల టెస్ట్‌లను కూడా క్లియర్ చేసింది. కానీ చివరి రౌండ్‌తో వీసా మాత్రం రాలేదు. ఇలా ఏడాది నుంచి జే1 వీసా కోసం రోహిణి ఎదురుచూస్తూనే ఉంది. ఇదిలా ఉంటే అమెరికాలో ప్రాక్టీస్‌కు సంబంధించి వెంటనే ఉద్యోగంలో చేరాలని ఫోన్ కాల్స్ కూడా ఎక్కువయ్యాయి. దీంతో తన అమెరికా కల కలగానే మిగిలిపోతుందని రోహిణి తీవ్ర నిరాశకు గురైంది. ఆ డిప్రెషన్లోనే తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. రోహిణి ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. .