Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంల్లో స్పై కెమెరాలు బిగించి 300 మంది వీడియోలు చిత్రీకరించారని తెలిసి విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే కాలేజీలో బందోబస్తుకు వచ్చిన ఎస్సై శిరీష విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించారు.
హాస్టల్లో ఉండే 300 మంది అమ్మాయిల వీడియోలు బయటకొచ్చాయన్న ఆవేశంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థినులతో ఎస్సై శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కదా.. మీరు ఎందుకు గొడవ చేస్తున్నారు.. మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది.. మేమేందుకు రాత్రంతా పడిగాపులు కాస్తూ ఉండాలంటూ మండిపడ్డారు. ఎస్సై సీరియస్ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న విద్యార్థినులు తమ ఫోన్లో వీడియో తీసి సోషల్మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. విద్యార్థుల పట్ల అహంకారంతో దురుసుగా మాట్లాడిన ఎస్సై శిరీషను సస్పెండ్ చేశారు. ఇలాంటి పోకడలను సహించేది లేదని స్పష్టం చేశారు.
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి సీఎం చంద్రబాబు వివరణ కోరారు. దర్యాప్తు బృందంలో ఎస్సై శిరీష లేరని.. కేవలం బందోబస్తు కోసమే ఆమెను పిలిపించామని అధికారులు వివరించారు. ఘటనపై అనంతరం ఆమెను బందోబస్తు విధుల నుంచి తప్పించామని.. ఆమె నుంచి వివరణ తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, బాధలో, ఆందోళనలో ఉన్న విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించడం సరికాదని చంద్రబాబు అన్నారు. వారి బాధను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించాలని సూచించారు.