Tirumala | తిరుమలలో శుక్రవారం రాత్రి కార్తీక పౌర్ణమి గరుడ సేవ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. రాత్రి ఏడు గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణికంగా 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యం సంతరించుకున్నది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడినని తెలుపుతారు. జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరు మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.