Srisailam | శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిలిపివేసిన విభూతిధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. సోమవారం ఆలయంలో ఆలయ ఈవో పెద్దిరాజు విభూతిధారణ కార్యక్రమానికి దాదాపు నాలుగేళ్ల తర్వాత శ్రీకారం చుట్టారు. ఆలయ సంస్కృతీ సంప్రదాయాలపై భక్తులందరికీ మరింత అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఈ విభూతిధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించామని ఈవో తెలిపారు. భక్తులకు విభూతిధారణ చేసేందుకు శివసేవకుల సహకారాన్ని తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయమన్నారు.
ఎంతో విశిష్టమైన మన ఆర్ష సంస్కృతికి ఇది ప్రతీకగా నిలుస్తుందన్నారు. అందుకే ఆలయప్రవేశం చేసేవారందరూ తప్పనిసరిగా నుదుట బొట్టును ధరించేందుకు వీలుగా విభూతిధారణ కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెట్టినట్లు తెలిపారు. విభూతికి ఎంతో మహిమ ఉంటుందని.. భారతీయ పురాణాలు పేర్కొంటున్నాయి. పవిత్రతను కలిగిస్తుందని, అరిష్టాలన్నింటిని తొలగించి సకల శుభాలను కలిగిస్తుందని చెబుతున్నాయని.. విభూతిధారణ వలన సమస్త సంపదలు చేకూరుతాయని పేర్కొంటున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. విభూతిధారణ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వీరయ్య, ఏఈవోలు ఎం హరిదాసు, ఐఎన్వీ మోహన్, పీఆర్వో శ్రీనివాసరావు, పర్యవేక్షకులు హిమబిందు తదితరులు పాల్గొన్నారు.