Srisailam Temple | శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులకు భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పారు. మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం భాగ్యాన్ని ఉచితంగానే భక్తులకు కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల కోరిక మేరకు ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత నుంచి నాలుగు గంటల వరకు ఉచిత క్యూలైన్ ద్వారా వచ్చిన భక్తులకు ఆధార్ అనుసంధానంతో ప్రత్యేకంగా టోకెన్ జారీ చేసి స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. రోజుకు వెయ్యి నుంచి 1200 మందికి ఉచిత స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేవస్థానం వద్దే టోకెన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఏ రోజు టోకెన్లు ఆ రోజే చేస్తామని వివరించారు. దేవస్థానం అధికారులు, సిబ్బందితో భక్తులు సహకరించాలని కోరారు.
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. చాలామందికి అలంకార దర్శనానికే అనుమతి ఉంటుంది. దేవస్థానం అధికారులు స్వామివారిని తాకే అవకాశం సైతం కల్పిస్తున్నది. ఈ స్పర్శ దర్శనం ప్రత్యేకం. స్వామివారి గర్భాలయంలోకి వెళ్లి మల్లికార్జున స్వామివారిని తాకే భాగ్యం భక్తులకు కలుగుతుంది. ఈ స్పర్శ దర్శనానికి వస్త్రధారణ కీలకం. పురుషులు తప్పనిసరిగా పంచె, కండువాతో దర్శనానికి వెళ్లాలి. షర్ట్లు, టీషర్ట్లు, ప్యాంట్‌తో వెళ్లేవారిని దర్శనానికి అనుమతి ఇవ్వరు. మహిళలు చీరలు, చుడిదార్‌లో దర్శనానికి రావాల్సి ఉంటుంది. లేకపోతే దర్శనానికి అనుమతి ఉండదు.