అమరావతి : ఏపీ (Andhra Pradesh ) వాసులకు చల్లటి కబురు అందింది. రేపటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy rains ) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు ఎనిమిది రోజుల ముందుగానే కేరళను తాకాయని ఐఎండీ (IMD) తెలిపింది.
ఈనెల 26 నాటికి రాయలసీమలో ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని , ఈనెల 29 కల్లా రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు.
దీంతో ఏపీలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని, రాబోయే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు, అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపారు.