Srisailam | శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి ఓ కుటుంబం కానుకగా బంగారు హారాలను కానుకగా సమర్పించింది. నెల్లూరుకు చెందిన అచ్యుత వేంకట స్వాయి మాధవ శశాంక్ కుటుంబీకులతో కలిసి దేవస్థానానికి మూడు హారాలను అందజేశారు. పగడాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు కూడిన ఈ మూడు బంగారు హారాల మొత్తం బరువు 232 గ్రాములు ఉంటుందని తెలిపారు. ఇందులో నాలుగు బంగారు గుండ్లు, ముత్యాలు, కెంపులు, పచ్చలు కలిగిన ఆకుపచ్చ రాయితో బంగారు డాలర్‌ను కలిగిన హారం బరువు 78 గ్రాములు ఉంటుందని.. నాలుగు గుండ్లు ముత్యాలు, కెంపులు, పచ్చలు ఆకుపచ్చ రాయి, బంగారు డాలర్‌తో కూడిన మరోహారం బరువు 79 గ్రాములు.. పగడాలు డాలర్‌తో కూడిన మరో హారం 75 గ్రాముల బరువు ఉంటుందని భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా శశాంక్ కుటుంబానికి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనాలు చేయించారు. అనంతరం అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో దాతలు బంగారు హారాలను ఈవో శ్రీనివాసరావుకు అందజేశారు. అనంతరం రశీదును అందజేశారు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలను అందజేసి, శేష వస్త్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో సహాయ ఏఈవో జీ స్వాములు, అమ్మవారి ఆలయ ఇన్స్పెక్టర్ కే మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.