ONGC Gas Leak: ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకవుతోంది. దీంతో అక్కడ భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దాదాపు వంద అడుగుల ఎత్తువరకు మంటలు వ్యాపించాయి. ఓఎన్జీసీ డిగ్గింగ్ ప్లేస్ నుంచి గ్యాస్ లీకైంది. దాదాపు మూడు గంటల నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో అక్కడి కొబ్బరి చెట్లు, పొలాలు భారీగా తగలబడిపోతున్నాయి. స్పందించిన అధికారులు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ముందుజాగ్రత్త చర్యగా స్థానిక ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తహశీల్దార్ శ్రీనివాస రావు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లతో సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఓఎన్జీసీ సాంకేతిక నిపుణుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం ఇరుసుమండ ప్రాంతంలో ఉన్న కొబ్బరిచెట్లు భారీగా దగ్ధమవుతున్నాయి. ఇప్పటికే 500పైగా కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. అక్కడికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పరిస్థితిని స్థానిక ఎంపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తగిన సహాయక చర్యలు తీసుకోవాలని మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్ ను ఆదేశించినట్లు తెలుస్తో్ంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.