తిరుమల : తిరుమలలో ఈనెల 21న గరుడ పంచమి(Garudapanchami) సందర్భంగా భక్తులకు శ్రీ మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. పంచమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామి (Malayappa Swamy) తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఈ నెలలో స్వామివారు రెండో సారి గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు.
ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడపంచమి పూజ చేస్తారని అర్చకులు వెల్లడించారు.
ఆగస్టు 21 నుంచి 23వ తేదీ పట్టాభిషేక మహోత్సవాలు
తిరుపతి(Tirupati) : వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు వెల్లడించారు. 21న సాయంత్రం 5 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 22న ఉదయం యాగశాల పూజ, స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నట్లు వివరించారు.
23న సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారని చెప్పారు. మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.300 చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చని తెలిపారు.