Cyclone Montha | మొంథా తుపాన్ బాధితులకు ఉచిత రేషన్.. వెల్లడించిన పవన్ కల్యాణ్
Cyclone Montha | మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యవసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఆ నిత్యవసర వస్తువులను సమకూర్చింది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం ( మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోలు), కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో ఉల్లిగడ్డలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెర అందించనున్నారు.
ఈ నిత్యవసర వస్తువులను ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రేషన్ షాపులకు చేర్చింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3424 మెట్రిక్ టన్నుల పంచదారతోపాటు ఇతర నిత్యావసరాలను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. నిత్యావసరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ సహాయక చర్యలు, నిత్యవసరాల పంపిణీని సమన్వయం చేస్తున్నారు.
మరోవైపు మొంథా తుపాన్ ప్రభావంపై తన కార్యాలయ అధికారుల ద్వారా క్షేత్ర స్థాయిలో పవన్ కల్యాణ్ సమాచారం తెలుసుకుంటున్నారు. అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్ల నుంచి పేషీ అధికారులు క్షేత్ర స్థాయి సమాచారం తీసుకొన్నారు. అర్థరాత్రి తుపాను తీరం దాటిన క్రమంలో తీవ్రమైన ఈదురు గాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై వివరాలు తెలుసుకున్నారు.
పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ తీగలు పడటం, అదే విధంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. తుపాను బలహీనపడ్డా భారీ వర్షాలు ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి ఆహార, వసతి కల్పించాలని స్పష్టం చేశారు. గాలులు తీవ్రంగా ఉండటం, కుండపోతగా వర్షం ఉన్నందున ప్రజలను ఇప్పటికిప్పుడు ఇళ్లకు పంపించడం శ్రేయస్కరం కాదన్నారు. ప్రజలకు పరిస్థితిని వివరించాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, నెల్లూరు జిల్లాలో పెన్నా నది, ఈ జిల్లాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్న క్రమంలో ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. వర్షాలు తగ్గు ముఖం పట్టిన తరవాత పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టిపెట్టాలనీ, రక్షిత తాగు నీరు సరఫరా చేయాలని సూచించారు.