Free Bus | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పంద్రాగస్టు సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ పథకం అమలు కోసం 8,458 బస్సులను సిద్ధం చేసింది. అలాగే రద్దీకి తగినట్లుగా ఏర్పాటు కూడా చేస్తోంది.
మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏయే బస్సుల్లో అమలు చేయాలి? గుర్తింపు కార్డుగా వేటిని అనుమతించాలనే దానిపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఉచిత ప్రయాణం పథకానికి సంబంధించి సమగ్ర వివరాలతో రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణం ఏయే బస్సుల్లో ఉండదో ఒక ప్రచారం జరుగుతోంది.
– ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనుమతిస్తారు. అయితే కొన్ని ఇంటర్ స్టేట్ సర్వీసుల్లో నడిచే ఎక్స్ప్రెస్ల్లో మాత్రం దీన్ని అనుమతించరు. అంటే ఏపీ నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలకు కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు.
– అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు ఉండదట. ఘాట్ రోడ్లలో నడిచే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తే.. రద్దీ పెరిగి ఘాట్ రోడ్డులో బస్సు నడపడం కష్టతరమవుతుందనే ఉద్దేశ్యంతో ఆయా రూట్లలో ఉచిత ప్రయాణానికి అనుమతించవద్దని భావిస్తున్నారు. తిరుమల ఘాట్ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉండదు.
– నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం ఉండదు.
ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలో మొత్తం 11,449 బస్సులు ఉన్నాయి. వీటిలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు(5851), ఎక్స్‌ప్రెస్‌లు (1610), సిటీ ఆర్డినరీ (710), సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ (287)లు కలిపి మొత్తం 8,458 బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నారు. అల్ట్రా డీలక్స్ (643), సూపర్ లగ్జరీ (1486), నాన్ ఏసీ స్లీపర్ స్టార్‌లైనర్ (59), ఏసీ బస్సులు (459), తిరుమల ఘాట్ బస్సులు (344) కలిపి మొత్తం 2991 బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనుమతించరు.