Free Bus Effect | ఉచిత బస్సు ప్రయాణంతో ఏపీలో కూడా మహిళల సిగపట్లు తప్పడం లేదు. స్త్రీ శక్తి స్కీమ్ ప్రారంభమైన మరుసటి రోజు నుంచే బస్సులో ఆడవాళ్లు కొట్టుకుంటున్న ఘటనలు బయటకొస్తున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు వాగ్వాదానికి దిగారు. అది కాస్త బాటిళ్లతో కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఎన్టీఆర్ జిల్లాలో సీట్ల కోసం ఫైటింగ్ చేసిన వీడియో ఇప్పుడు ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. అలా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు బయల్దేరిన బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉచిత బస్సు పథకం ఎఫెక్ట్‌తో చాలామంది మహిళలే ఆ బస్సులో ప్రయాణించారు. ఈ క్రమంలో సీటు దొరకని మహిళ.. కూర్చున్నవారిపై అవాకులు చెవాకులు పేలారు. అవి విన్న మహిళా ప్రయాణికురాలు ఆమెతో వాగ్వాదానికి దిగారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మొహం పచ్చడి చేస్తా అంటూ సీటులో కూర్చున్న మహిళ లేచి మరి గొడవకు దిగింది. అప్పుడు నిల్చున్న ఆమె మరింత రెచ్చిపోయి బూతులు తిట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన సీటు దొరికిన మహిళ.. తన దగ్గర ఉన్న బాటిల్‌తో కొట్టింది. అలా ఇద్దరు కూడా బాటిళ్లతో కొట్టుకున్నారు.
అదే సమయంలో ఎవరి బంధువులు వారికి మద్దతుగా నిలబడటంతో గొడవ మరింత పెద్దగా అయ్యింది. అలా ఇరువర్గాలు కాసేపు వాటర్ బాటిళ్లతో కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సు నందిగామ సమీపంలోని మునగచర్ల అడ్డరోడ్డుకు వద్దకు రాగానే.. విసిగిపోయిన పలువురు ప్రయాణికులు.. బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అప్పుడు మహిళలు కాస్త తగ్గడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనను ఒక ప్రయాణికుడు మొబైల్లో వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి నందిగం మండలం దిమ్మిడిజోల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో గత గురువారం మహిళా ప్రయాణికురాలు, ఓ యువకుడి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అంతకుముందు విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీటు కోసం ఓ మహిళ గొడవపడి.. మగ ప్రయాణికుడి చెంప చెళ్లుమనిపించింది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.