Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సోమవారం తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు. తాను గానీ అపరాధం చేసి ఉంటే.. తనతో పాటు కుటుంబ సభ్యులు సైతం సర్వనాశనం అయిపోవాలన్నారు. తాను రాజకీయంగా ఒక్క మాట మాట్లాడడం లేదు గోవిందా.. గోవిందా అంటూ ఆయన ప్రమాణం చేశారు. తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేశారని.. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నట్లు ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది.
ఈ క్రమంలో భూమన కరుణాకర్‌రెడ్డి తిరుమలలో తాము తప్పు చేయలేదని ప్రమాణం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అన్న మాట మేరకు ఆయన తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తన మనసు కలత చెందుతోందన్నారు. కలుషిత రాజకీయ మనస్కులు దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. ప్రమాణానికి ముందు ఆయన శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేశారు. ఆ తర్వాత అఖిలాండం వద్ద చేతిలో కర్పూరం వెలిగించి ప్రమాణం చేశారు. అనంతరం శ్రీవారి ఆలయ మహాద్వారానికి మొక్కారు. ప్రమాణం అనంతరం భూమనను పోలీసులు అదుపులోకి తీసుకొని తిరుపతికి తరలించారు.