అమరావతి : ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Former minister Amarnath) వాలంటర్ ( Volunteer ) వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థతో కూడా ప్రజలకు, నాయకులకు మధ్య గ్యాప్ ఏర్పడిందని అంగీకరించారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ( Election Results) వెల్లడి అనంతరం మొదటిసారి గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల వైసీపీ (YCP) కార్యకర్తలకు సముచిత గౌరవం ఇవ్వలేదనే బాధ కలిగిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రచారంలో గాని , మంత్రి హోదా సమయంలో గాని పనిచేసినప్పుడు ఈ సమస్యను గుర్తించానని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో మంచి, చెడు ఉంటాయని అన్నారు. ఈ నిర్ణయంతోనే వైసీపీకి ఓటమి ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ప్రజలు ఏం కోరుకున్నారనే దానిపై పార్టీ నాయకత్వం చర్చిస్తుందని, త్వరలో ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని , రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు.