Vijayawada | ఏపీలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా మహోగ్రరూపం దాల్చిన బుడమేరు కాస్త శాంతించింది. కృష్ణా నది వరదలు కూడా తగ్గింది. దీంతో బుడమేరు ఉధృతికి నీట మునిగిన సింగ్‌నగర్ ప్రాంతంలో మూడు అడుగల మేర వరద ఉధృతి తగ్గింది. దీంతో ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు వస్తున్నారు.
బుడమేరు ఉధృతి కారణంగా ఐదారు అడుగుల ఎత్తున నీరు నిలవడంతో స్థానికులు నిన్నటిదాకా బయటకు రాలేకపోయారు. పడవలు ఏర్పాటు చేసి కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించినా.. అధిక శాతం మంది పై అంతస్తులో బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ప్రధాన రహదారుల వెంబడి ఉన్నవారికి ఆహారం, తాగు నీరు అందినప్పటికీ.. లోపలి ప్రాంతాల్లోని వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయటకు రావాలంటే పడవలు లేక, తాగునీరు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇవాళ వరద ఉధృతి తగ్గడంతో జనాలు మెల్లిగా బయటకొచ్చారు. దీంతో అక్కడ సహాయక చర్యలు కూడా వేగవంతం చేశారు. ముందుగా గర్భిణులు, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వరద ఉధృతి తగ్గడంతో బుడమేరులో గండి పడిన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టిన అధికారులు.. మొత్తం మూడు చోట్ల గండిపడినట్లు గుర్తించారు. రెండు మూడు రోజుల పాటు ఈ పనులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కాగా, ప్రకాశం బ్యారేజికి కూడా వరద తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ బ్యారేజి దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దిగువకు 8చ63,576 క్యూసుక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
బుడమేరు కృష్ణా నదికి దగ్గర ప్రవహిస్తుంది. అయినప్పటికీ ఇది కృష్ణా బేసిన్లో భాగం కాదు. కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతంలో ఇది ఒక భాగం. విజయవాడ నగరంలో వరదలకు బుడమేరు వాగే ప్రధాన కారణం. అందుకే 2003, 2005 వరదల తర్వాత అప్పటి ఏపీ ప్రభుత్వం బుడమేరు వాగు ప్రవాహంలో కొంత భాగాన్ని పోలవం కాలువతో అనుసంధానం చేయడం ద్వారా కృష్ణా నదిలోకి మళ్లించింది.