మహాశివరాత్రి వేళ విషాదం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి స్నానాలకు దిగి ఐదుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
తాడిపూడికి చెందిన ఐదుగురు యువకులు తిరుమల శెట్టి పవన్(17), పడాల దుర్గాప్రసాద్(19), అనిసెట్టి పవన్(19), గర్రె అకాశ్(19), పడాల సాయి కృష్ణ (19) కొవ్వూరు, తాళ్లపూడి, రాజమహేంద్రవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు. ఒకే ఊరికి చెందిన వీరంతా మహాశివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజామున గోదావరి నదిలో స్నానాలకు వెళ్లారు. ఆ సమయంలో నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఒకరు నీటిలో మునిగిపోయారు. స్నేహితుడిని రక్షించేందుకు ప్రయత్నించే క్రమంలో మిగిలిన నలుగురు యువకులు కూడా నీటిలో గల్లంతయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్లసాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో దుర్గాప్రసాద్ మృతదేహం లభ్యమైంది.