AP News | మహాశివరాత్రి వేళ గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతైన యువకుల కథ విషాదాంతమైంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు దుర్మరణం చెందారు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. యువకుల మృతదేహాలను వెలికితీయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. తాడిపూడికి చెందిన 11 మంది యువకులు కొవ్వూరు, తాళ్లపూడి, రాజమండ్రిలో ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు. మహాశివరాత్రి కావడంతో బుధవారం ఉదయం ఆ యువకులు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఆ నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో ఒకరు నీటిలో మునిగిపోయారు. స్నేహితుడిని రక్షించే క్రమంలో ఇంకొకరు.. అలా ఒకరినొకరు రక్షించుకునే క్రమంలో ఐదుగురు గల్లంతయ్యారు. యువకులు గల్లంతైన విషయం తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో వెతికించారు. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ లాభం లేకపోయింది. నీటిలో గల్లంతైన ఐదుగురిలో ఒక్కరిని కూడా ప్రాణాలతో కాపాడలేకపోయారు. గంటల తరబడి శ్రమించి వారి మృతదేహాలను మాత్రమే బయటకు తీసుకురాగలిగారు.
East Godavari
మృతులను తిరుమల శెట్టి పవన్(17), పడాల దుర్గాప్రసాద్(19), అనిసెట్టి పవన్(19), గర్రె అకాశ్(19), పడాల సాయి కృష్ణ (19)గా గుర్తించారు. మహాశివరాత్రి వేళ ఐదుగురు యువకులు మరణించడంతో తాడిపూడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.