అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు నిద్రిస్తుండగా ఆశ్రమంలోని ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మొత్తం ఎగసి పడటంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది పిల్లలను బటకు తీసుకొచ్చారు. విద్యార్థులు బటకు పరుగులు తీశారు. అయితే ఓ గదిలో ఆరుగురు విద్యార్థులు చిక్కుకు పోయారు.
ఈ నేపథ్యంలో తలుపులు పగులగొట్టిన సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చారు. హుటాహుటిన వారిని 108 అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు. వారికి కాలినగాయాలవడంతో వైద్యులు చికిత్స నందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఎలా చెలరేగాయనే విషయం ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆశ్రమంలో 140 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.