అమరావతి : వైసీసీ అధ్యక్షుడు , ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ (MLC) ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే పోటీ నుంచి తప్పుకున్నారని విమర్శించారు. విశాఖ (Visaka) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం భీమిలి, యలమంచిలి నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీలు(ZPTC), ఎంపీటీసీ(MPTC) లు , కౌన్సిర్లలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆర్థిక సంక్షోభం, ఇతర కారణాలు చెబుతూ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు క్యాలెండర్ ప్రకారం పథకాలు అందించామని పేర్కొన్నారు. పథకాలను ప్రతి ఇంటికి చేరవేశామని
అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన ప్రజావ్యతిరేకత కనిపిస్తోందని వెల్లడించారు. పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఐక్యంగా ఉండడంతోనే ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి తప్పుకున్నారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయని మండి పడ్డారు. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలని, ప్రజలకు తోడుగా ఉంటే రాబోయే రోజుల్లో ఆదరిస్తారని అన్నారు.