కన్నతండ్రే కాలయముడయ్యాడు. బయటకు తీసుకెళ్తానని చెప్పి, ఇద్దరు కుమార్తెలను కెనాల్లో తోసేసి చంపేశాడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన కల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు సింధు, అనసూయ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5, 6 తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్దే ఉన్న కుమార్తెలకు మాయమాటలు చెప్పి హెచ్ఎల్సీ కాల్వ దగ్గరకు తీసుకెళ్లాడు. మొదట పెద్ద అమ్మాయిని కెనాల్లో తోసేశాడు. అది చూసి చిన్న కుమార్తె భయంతో పరుగెత్తగా.. ఆమెను కూడా పట్టుకొచ్చి కెనాల్లో తోసేశాడు. తర్వాత ఏం తెలియనట్లుగా ఇంటికి వచ్చేశాడు.
ఇద్దరు కుమార్తెలు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కల్లప్పను నిలదీశారు. దీంతో కర్ణాటకలోని సిరిగేరి క్రాస్ వద్ద హెచ్ఎల్సీ కాల్వలో తోసేశానని ఒకసారి, గ్రామంలోని హెచ్ఎల్సీ కాల్వలో తోసేశానని మాట మార్చాడు. ఈ క్రమంలోనే కల్లప్ప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పెద్ద కుమార్తె అనసూయ మృతదేహాన్ని కాల్వలో గుర్తించి బయటకు తీశారు. చిన్న కుమార్తె మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.