అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పోరాటం 800 రోజులకు చేరుకున్నది. వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవిధంగా కోర్టు నుంచి గుడి వరకు అంటూ అమరావతి నుంచి తిరుమల కొండ వరకు రైతులు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో రైతులకు యువకులు, మహిళలు, వివిధ పార్టీల నేతలు అండగా నిలిచారు. రైతుల పోరాటం 800 రోజులకు చేరుకున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రైతులకు అభినందనలు తెలిపారు.
రైతుల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతుగా ఉంటుందని చంద్రబాబు ఇదివరకే స్పష్టం చేశారు. లక్షల కోట్ల సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని ఆపిన సీఎం జగన్ను చరిత్ర ఎప్పటికీ క్షమించదని చంద్రబాబు ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. నిధుల కోసం అమరావతి భూములను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని విమర్శించారు. రాజధానిని జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని, రాష్ట్రంలోని అన్ని రంగాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. జగన్తో పాటు మరికొందరు చేస్తున్న ప్రతి ఆరోపణ అబద్ధమని రుజువు చేయడంలో అమరావతి అండగా ఉన్నదన్నారు. కాగా, అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ చేస్తున్న పోరాటంలో రైతులు తప్పక విజయం సాధిస్తారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 800 రోజుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. రైతులు 24 గంటల సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రజా దీక్ష శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగనున్నది. రాజధాని పరిధిలోని వెలగపూడిలో చేపట్టిన దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.