తిరుమల : టీటీడీ ఈవో జె.శ్యామలరావు (TTD EO ) శుక్రవారం తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వకుళామాత కేంద్రీయ వంటశాలను పరిశీలించిన ఈవో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీ-5ను తనిఖీ చేశారు. అక్కడ పనుల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. కౌస్తుభం, సప్తగిరి (Saptagiri), ఎస్ఎంసీ, షాపింగ్ కాంప్లెక్స్ వద్ద హోటళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
శిలా తోరణం వద్దకు చేరుకుని తనిఖీలు(Visits) చేపట్టారు. ఔటర్ రింగ్ (Outer ring road) రోడ్డులో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్మిస్తున్న నూతన క్యూలైన్లు, మరుగుదొడ్లు, ఫుడ్ కోర్టులను పరిశీలించారు. ఈవో వెంట అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, టీటీడీ సీఈ సత్య నారాయణ, ఈఈలు వేణు గోపాల్, సుబ్రహ్మణ్యం, డీఈ చంద్రశేఖర్, ఎస్టేట్స్ అధికారి వెంకటేశ్వరులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మెట్ల మార్గాన వచ్చే భక్తులకు టీటీడీ సూచనలు..
తిరుమల కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన మెట్లమార్గాన (Stairs) వచ్చే భక్తులకు టీటీడీ (TTD Instructions ) పలు సూచనలు చేసింది. ముఖ్యంగా పలు ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వృద్ధులు, అధిక రక్తపోటు, మధుమేహం(Diabetes) , కీళ్లవ్యాధులు, మూర్ఛ, గుండె సంబంధిత (Heart diseases) వ్యాధులున్నవారు మెట్లమార్గాన రావడం శ్రేయస్కరం కాదని వెల్లడించింది. తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని వివరించారు
. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజు వారి మందులు వెంట తెచ్చుకోవాలని అన్నారు. కాలినడకన ఏవైనా సమస్యలు ఎదురవుతే 1500 మెట్టు, గాలిగోపురం, భాస్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు. తిరుమలలోని ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.