అమరావతి : రాష్ట్రంలో వేసవి సెలవులను(Summer holidays) పొడిగిస్తున్నట్లు(Extension) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని తెలిపింది. 12న సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.
సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరోరోజు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్పుతో ఒక రోజు తర్వాత అంటే.. ఈ నెల 13న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12న ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధానితో పాటు వీఐపీలురానుండడంతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.