Undavalli Arun Kumar | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లలో మాత్రమే గెలవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ పని అయిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నిరాశ నిస్పృహల్లో మునిగిపోయిన వైసీపీ నాయకుల్లో ఉత్సాహం నింపేలా ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడారు. సీట్లు తక్కువ వచ్చినంత మాత్రాన రాజకీయ పార్టీల చాప్టర్లు క్లోజ్ కావని అన్నారు.
వైసీపీ 11 స్థానాల్లోనే గెలవచ్చు.. కానీ 2019లో చంద్రబాబుకు వచ్చిన ఓట్ల కంటే జగన్‌కు ఎక్కువే వచ్చాయని ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని సూచించారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించడంలో విఫలమైతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదని తెలిపారు.
ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. 1989లో ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఎన్నికలు జరిగితే కరుణానిధి పార్టీకి 169 సీట్లు వచ్చాయని.. జయలలిత పార్టీకి కేవలం 30 సీట్లే వచ్చాయని చెప్పారు. అదే 1991లో ఎన్నికలు జరిగితే జయలలితకు 285 సీట్లు వచ్చాయని.. కరుణానిధికి కేవలం ఏడు సీట్లే వచ్చాయని గుర్తుచేశారు. అప్పుడు కరుణానిధి ఏడుస్తూ ఇంట్లోనే కూర్చోలేదని.. ప్రతిపక్షంలో ఉండి పోరాడాడని చెప్పారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో 221 సీట్లతో కరుణానిధి గెలిస్తే.. జయలలితకు నాలుగు సీట్లే వచ్చాయని అన్నారు. సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. వైసీపీ కూడా ప్రతిపక్ష పాత్ర సమర్థంగా నిర్వహిస్తే అలాంటి అవకాశమే దక్కే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. నిస్సత్తువ, నిస్సహాయత ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావడం అనవసరమని అభిప్రాయపడ్డారు.