Vidadala Rajini | ఆరోగ్యశ్రీ మీద టీడీపీ కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. సాకులు చెబుతూ ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. బుధవారం విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
నాడు చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీలో 1059 వైద్య సేవలు ఉంటే.. జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని 3257కి పెంచి బలోపేతం చేశామని విడదల రజిని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచామని చెప్పారు. బాబు పెట్టి వెళ్లిన బకాయిలను కూడా జగన్ ప్రభుత్వం తీర్చిందని తెలిపారు. 2024 జనవరి వరకు ఉన్న బిల్లులు మొత్తం క్లియర్ చేశామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. సాకులు చెబుతూ ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అప్పులు, బకాయిల పేరుతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుంచి వైదొలుగుతుందా అన్న భయం ప్రజల్లో నెలకొందని విడదల రజినీ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. ఆరోగ్యశ్రీ అమలు కష్టమని, ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారని గుర్తుచేశారు. ఈ మాటల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు మనసులో మాటలనే చెబుతున్నారా అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మంచి పేరు వస్తుందనే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.