TG Venkatesh | విభజన హామీల్లో వచ్చిందే తీసుకోవాలని.. లేని దానికోసం పాకులాడ కూడదని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలు వచ్చే వాటిపై కామెంట్స్ చేస్తే మనకే నష్టమని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా చంద్రబాబుకే ఉందని అన్నారు.
రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా చంద్రబాబుకే ఉందని మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ ప్రశంసలు కురిపించారు. రాయలసీమలో పెండింగ్లో ఉన్న సాగు, తాగు నీటి ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి కానున్నాయని ఆయన తెలిపారు. పెన్నా – గోదావరి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి భగీరథ యజ్ఞం చేస్తున్నాడని తెలిపారు. సిద్ధేశ్వరం బ్యారేజిని ఐకాన్ బ్రిడ్జిగా మార్చాలనే ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని చెప్పారు.
ఫ్యాక్షన్ను అణిచివేయడంలో చంద్రబాబు దిట్ట అని టీజీ వెంకటేశ్ పొగిడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో అనుకూలమైన వాతావరణం ఉందని అన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.