Roja Selvamani | ఏపీ సీఎం చంద్రబాబు మహిళలను మరోసారి మోసం చేశారని మాజీ మంత్రి రోజా సెల్వమణి అన్నారు. ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్.. సూపర్ చీట్స్‌గా మారిపోయిందని విమర్శించారు. తొలి బడ్జెట్ లోనే చంద్రబాబు మోసం బయటపడిందని అన్నారు.
19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామని చెప్పి బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడం మోసం కాదా అని రోజా ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవగానే ప్రతి నిరుద్యోగ యువతీయువకులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఒక్క రూపాయి కేటాయించకపోవడం దగా కాదా అని నిలదీశారు. ఎన్నికల్లో గెలవగానే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు.. ఇప్పుడు ఆ పథకానికి నిధులే ఇవ్వలేదని.. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు.
తల్లికి వందనం పథకానికి నిధులు సగానికిపైగా కోత పెట్టడం దగా కాదా అని రోజా నిలదీశారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని.. ఈ ఏడాది 2 సిలిండర్లను ఎగనామం పెట్టడం మోసం కాదా అని ప్రశ్నించారు. 50 ఏళ్లకే మహిళలకు పెన్షన్ ఇస్తామన్నారని.. ఈ బడ్జెట్లో ఆ ప్రస్తావన ఏది అని ప్రశ్నించారు. రైతులకు 20 వేలు ఏడాది పెట్టుబడి సహాయం ఇస్తామన్నారు… 10 వేల కోట్లు ఇవ్వాల్సింది.. 4,500 కోట్లే ఇవ్వడం రైతులను మోసం చేయడం కాదా అని మండిపడ్డారు.
ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటింటికీ మీరిచ్చిన బాబు ష్యురిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ.. బాండ్లను ఇప్పుడు ఏం చేసుకోవాలని రోజా మండిపడ్డారు. ఆ చెల్లని బాండ్లపై ఇప్పుడు ప్రజలు చీటింగ్ కేసులు పెట్టాలనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.