ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయి దాటిందంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు ఏది చేసినా ఒప్పు.. జగన్ ఏం చేసినా తప్పు అన్నట్లుగా పచ్చ మంద మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్లోని నాలుగు రాష్ట్రాల్లోని ఉన్నత స్థాయి వ్యక్తులకు వందల కోట్ల లంచం ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో 2021లో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల్లో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి రూ.1750 కోట్లు లంచం అందిందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయి దాటిందంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ రూ.6.99లకు కొంటే తప్పు లేదు కానీ.. జగన్ కేవలం యూనిట్ విద్యుత్ రూ.2.49లకే కొంటే మాత్రం అది తప్పు అన్నట్లుగా దుష్ప్రచారంచేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అదానీతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎక్కడ అవినీతి జరిగిందని నిలదీశారు. సరే తప్పు జరిగిందని భావిస్తే గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఈ కూటమి ప్రభుత్వ క్యాన్సిల్ చేస్తుందా అని ప్రశ్నించారు.