Srisailam | శ్రీశైల క్షేత్ర చారిత్రక సంపద పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రంలోని పలు ప్రాచీన శాసనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పరిపాలన అంశాల పరిశీలనలో భాగంగా పలు పురాతన కట్టడాలను తెలుగు విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ఆర్.చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఈవో పరిశీలించారు.
అనంతరం ఈవో మాట్లాడుతూ.. దివ్యక్షేత్రంగా, పవిత్ర తీర్థంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, సాంస్కృతిక, విద్య, వైద్య నిలయంగా శ్రీశైల క్షేత్రం వెలుగొందిందని చెప్పేందుకు క్షేత్ర చారిత్రకసంపద ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అందుకే క్షేత్రంలోని చారిత్రక సంపద పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. ఇటీవల పునరుద్ధరించిన పంచ మఠాలను భక్తులు ఒకేసారి దర్శించేందుకు వీలుగా అన్ని మఠాలను కలుపుతూ ఏకదారిని నిర్మించే పనులను ప్రారంభించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. విభూతి మఠం ముందు భాగంలో గల ప్రాచీన మెట్ల మార్గానికి మరమ్మతులు చేసి, ఆ మార్గాన్ని పునరుద్ధరించేందుకు కూడా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ప్రాచీన రాతి విగ్రహాలను తగువిధంగా పరిరక్షించాలని సూచించారు. పంచ మఠాల ప్రాశస్త్యం తెలిసే విధంగా క్షేత్ర పరిధిలో అక్కడక్కడ సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్, శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.
రుద్రాక్ష మఠం, విభూతి మఠ సమీపంలో పురాతన చిత్ర లిపి ఉన్నట్లుగా చరిత్రకారులు గుర్తించారని ఈవో తెలిపారు. ఈ మఠాల సమీపంలో బండపరుపుపై ( షీట్క్) ఈ చిత్ర లిపిని గుర్తించారని పేర్కొన్నారు. ఈ లిపి ప్రస్తుత వ్యవహార ఆంగ్ల శకానికి చాలా పూర్వకాలం నాటివని పలువురు చరిత్రకారులు భావిస్తున్నారని చెప్పారు. చరిత్ర నిపుణుల సహకారంతో ఈ చిత్ర లిపి విశ్లేషణకు చర్యలు చేపడతామని అన్నారు. ఇందుకుగాను చరిత్ర, శాసన పరిశోధకుల సలహాలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దేవస్థానానికి సంబంధించిన అన్ని ఉద్యానవనాలలో కూడా మరింతగా బిల్వం, కదంబం, ఉసిరి మొదలైన దేవతా వృక్షాలను నాటాలని సూచించారు. సందర్శకులలో అవగాహన కలిగేందుకు ఆయా ఉద్యానవనాల్లో చెట్ల వద్ద వాటి సాధారణ నామం, శాస్త్రీయ నామం తెలిసే విధంగా నామ ఫలకాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.