Srisailam | శ్రీశైలం, జులై 1 : ప్రముఖ జ్యోతిర్లింగ, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి లడ్డూ ప్రసాదం పవిత్రత, నాణ్యతకు మారుపేరులా ఉంటుందని భక్తులు అభిప్రాయపడుతుంటారని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అన్నారు. అలాంటి లడ్డూప్రసాదంలో క్రిమికీటకాలు (మిడత) వచ్చిదంటూ ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద ఓ భక్తుడు సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు జరిగిన తతంగాన్ని సీసీ ఫుటేజీల ద్వారా పరిశీలించి.. విచారణ చేపట్టారు. కావలి ప్రాంతానికి చెందిన భక్తుడు దురుద్దేశంతో క్షేత్ర వైభవానికి భంగం కలిగించేలా ప్రవర్తించాడని అధికారులు గుర్తించారు. అదే విధంగా తప్పుడు చేసిన వారితో పాటు అతనికి సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ప్రసాదాల విక్రయ కేంద్రాన్ని ఈవోతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా లడ్డు పోటును తనిఖీ చేశారు. ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు.